అదొక కార్పొరేట్ స్కూల్. ఆంధ్ర దేశంలో అరవై బ్రాంచీలతో దిగ్విజయంగా నడుస్తోంది. ఏ బ్రాంచి చూసినా వేలకొద్దీ పిల్లలు. ఐఐటి కోచింగ్, కంప్యూటర్ లెర్నింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్స్ తో సోఫిస్టికేటెడ్, అడ్వాన్స్`డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లు ప్రచారహోరు. కాన్సెప్ట్ టెక్నో సూపర్ మెగా స్కూలు అంటూ గొప్ప పేరు. పెయింటింగ్, చెస్, యోగా…. మొదలైన సర్వకళా నిలయమంటూ వాళ్ళు ప్రదర్శించే తీరు…ఓ…న భూతో న భవిష్యతి. ఇంకా ఎన్ని విశేషణాలు దొరికితే అన్ని విశేషణాలతో ఈ స్కూలు పేరు క్రింద సబ్ టైటిల్స్`గా అతుక్కుపోతాయి.
ఇప్పుడిది కార్పొరేట్ స్కూళ్ళ యుగం. డ్రస్ మెటీరియల్(యూనిఫాం) దగ్గరనుండి స్టడీ మెటీరియల్ వరకు ఎ టు జడ్ వీరే అందిస్తారు. టైం మెయింటెనెన్స్ లో వీరికి వీరే సాటి! ఉదయం నాలుగు గంటలకు మేలుకొలుపు గీతాలు. రాత్రి తొమ్మిది గంటల వరకు చదువు. స్టడీ అవర్స్ నడపడంలో వీరికి వీరే సాటి. మ్యాథ్స్ ఎనాలిసిస్`లో తమకు సాటి మరొకరు లేరన్న ప్రచారం. పాఠశాల భవన నిర్మాణం చూస్తే ఆనాటి మయసభ, ఈనాటి స్టార్ హోటళ్ళు, హైటెక్ భవనాలు దాని ముందు దిగదుడుపు.
ఇంతటి పబ్లిసిటి ఉన్న ‘గొప్ప’ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నందుకు ఆనందరావు ఆనందం ఇంతా అంతా కాదు! ‘డెమో’ పూర్తిచేసి ఉద్యోగం ‘ఓకే’ అయిన తరువాత తనకు డి.యస్.సి. రానందుకు పడుతున్న బాధనంతా మరచిపోయాడు. ప్రారంభంలోనే పదివేల జీతం! ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం వస్తే మాత్రం ఏముంది! రెండువేలతో సరిపెట్టుకోవాలి. ఆ తరువాత పదివేలకు రీచ్ అవ్వాలంటే ఐదేళ్ళు పడుతుంది. అదేకాలంలో ఇక్కడ… ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు… పదిహేడు పద్దెనిమిది వేలు మంత్లీ డ్రా చేయవచ్చు. పైగా ఎక్స్ ట్రా అవర్స్ చేస్తే ఎక్స్ ట్రా మనీ…ఓహో…అనుకున్నాడు ఆనందరావు.
కాని-
ఇతని ఆనందం నీరుకారిపోవటానికి ఎంతోకాలం పట్టలేదు. రెండు నెలల్లో అంతా అర్ధమయ్యింది. పైన పటారం లోన లొటారం! తల్లితండ్రులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలే తప్ప ‘విద్యార్థి ‘ ఎలా పోయినా వీళ్ళకు అక్కరలేదు. ఇక్కడి ఉపాధ్యాయులు యాజమాన్యం ఎలా ఆడిస్తే అలా ఆడే ఆటబొమ్మలు మాత్రమేనని తెలుసుకున్నాడు.
ప్రభుత్వ పాఠశాలల్లో లేని ‘ఆకర్షణ’ వీళ్ళు చూపిస్తారు. ప్రభుత్వం ఇంత అందమైన భవనాలను కట్టగలదా? ఎ.సి.లు పెట్టగలదా? కెమెరాలను అమర్చి ఉపాధ్యాయుల పనిని వాళ్ళకు అనుకూలంగా నియంత్రించగలదా! పత్రికల్లో టివీల్లో వ్యాపార ప్రకటనలు ఇచి విద్యార్ధులను రాబట్టగలదా? అతి తక్కువ సెలవులతో స్కూళ్ళు నడపగలదా? ఆ సెలవుల్లో కూడా ఉపాధ్యాయులను స్కూలుకు రప్పించి ఏ పనీ లేకుండా బంధించగలదా?
పేదా-సాదా, కులం-మతం తేడా లేకుండా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి. లౌకికరాజ్యం కదా! కాని కార్పొరేట్ స్కూళ్ళు అలాకాదు. కులమతాల ప్రశ్న పైకి కనపడదు. కాని ఇవి డబ్బున్న వారికి మాత్రమేనన్నది సుస్పష్టం.
ప్రతి పదిహేనుమంది విద్యార్ధులకు ఒక వార్డెన్ ఉంటాడు. టీచర్స్`తో పాటు కేర్ టేకర్స్, సూపర్వైజర్లు, అకడమిక్ అబ్జర్వర్లు, కో ఆర్డినేటర్లు, ఇన్-చార్జీలు…వామ్మో…యిదంతా ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకుంటుంది! అందుకే ‘జనం’ ఈ దారి పట్టారు.
డబ్బున్నవారితో పాటు మధ్యతరగతి వారు కూడా! మనకొక సామెత ఉందికదా! ఒక గొర్రె ఏ దారి పదితే మిగిలినవన్నీ అదే దారి. ముఖ్యంగా ‘ఇంగ్లీషు’ ఆకర్షణ వారిని ఇటు నడిపిస్తోంది. నేతి బీరకాయలో ‘నెయ్యి’ ఉండదన్న సంగతి గ్రహించడానికి ఆనందరావుకు రెండు నెలలు పట్టింది. కాని ఈ సత్యాన్ని తల్లిదండ్రులు గ్రహించాలంటే వాళ్ళు ఈ స్కూళ్ళకు వచ్చి చూడాలి కదా! కాని అంత ప్రత్యక్షంగా చూడటానికి వాళ్ళకు అవకాశం ఏది? రిసెప్షన్ వద్దే ఆగిపోవాలి. వర్కింగ్ అవర్స్`లో వస్తే పేరెంట్స్ రూం`లో వెయిట్ చెయ్యాలి. ఎనౌన్సర్ మైక్`లో ఆ విద్యార్ధి పేరు చెబుతూ ‘యువర్ పేరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యు అని రెండు మూడుసార్లు అరుస్తాడు. ఆ మైక్`లో తమ పుత్రరత్నం పేరు వినగానే ఇక్కడి తల్లిదండ్రుల హృదయాల్లో ఉద్వేగం, పుత్రోత్సాహం ఉరకలు వేస్తుంది. అల వైకుంఠపురంబులో.. అన్నట్లుగా ఐదంతస్తుల మేడదిగి వస్తాడు పుత్రుడు. యూనిఫాంతో, బెల్టు, టై, షూస్`తో వస్తున్న పుత్రుణ్ణి లేక పుత్రికను చూసిన కన్నవారికి కన్నీరో పన్నీరో తెలియని బాష్పాలతో కనుకొలకులు నిండిపోతాయి. అది చాలు వారికి-అక్కడ వాడు ఏం చదువుతున్నాడో తరువాత విషయం!
ఆ తరవాత విషయాలన్నీ ఆనందరావుకు బాగా తెలుసు. తరగతి గదుల్లోను, హాస్టల్ రూంలోను సూపర్వైజర్లు, వార్డెన్లు వారిని ఎంత అమానుషంగా హింసిస్తారో తాను కళ్ళారా చూశాడు కదా!
ఒక విద్యార్ధికి ఫస్టు యూనిట్లో మార్కులు సరిగా రానందుకు ఒక సూపర్వైజర్ తన ప్రక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీ ఎత్తికొట్టాడు. “ఎవడి సంక నాకుతున్నావమ్మా “(ఇదే వీరి లోపలి ఇంగ్లీషు) “ఈసారి బాగా రాకపోతే నీకు టి.సి. ఇచ్చి పంపేస్తాం.” ఆ కృతకమైన, అశ్లీలమైన భాష వినలేక ఆనందరావు ఎంతో బాధపడుతూ ఉండేవాడు.
ఒకసారి ఒక సూపర్వైజర్ – బాతుని మెడపట్టుకుని పైకి లేపినట్టు ఆరవ తరగతి విద్యార్ధి మెడపట్టుకుని పైకి లేపాడు. వాడు చచ్చిపోతాడేమో అనుకున్నాడు ఆనందరావు. ఎదురుగా ఉన్న క్లాసులో నుండి చూస్తూ – ఇక చూడలేక “దింపవయ్యా! చచ్చిపోతాడు” అని గట్టిగా అరిచాడు.ఆయన ‘అరుపు’ తో వదిలాడేకానీ లేకపోతే మరికొంతసేపు పట్టుకునేవాడే! విచిత్రం ఏమిటంటే అలా అరిచినందుకు సూపర్వైజర్ నుండి కంప్లైంట్ వెళ్ళింది. ప్రిన్సిపల్ ఆనందరావును పిలిచి ఫస్టు వార్నింగ్ ఇచ్చాడు-’అదంతా నీకు అనవసరం’ అని!
చూసేవాడి స్థితి అలా వుంటే అనుభవించే వాడి పరిస్థితి ఏంటి? ఇలాంటి హింసలు భరించలేక కొందరు పిల్లలు గోడలు దూకడం, మేడలు దూకడం, ప్రాణాలు వదలటం జరుగుతోంది.
పిల్లల్ని కొట్టకూడదనే రూల్స్ ఉంటాయి. ఉపాధ్యాయుడు కొట్టకూడదు. సూపర్వైజర్లు కొట్టవచ్చు. కాలం మారింది ఉపాధ్యాయుడి చేతిలో నుండి సూపర్వైజర్ చేతిలో పడ్డాడు విద్యార్ధి!
అక్కడి శిక్షలు చూసి ఆనందరావు గజగజలాడటం మొదలుపెట్టాడు. అయినప్పటికి ఆ అమానుష చర్యలు చూసి తనకెందుకులే అని సరిపెట్టుకోలేకపోయాడు. అప్పుడప్పుడు ‘అడ్డుకొని’ ప్రిన్సిపల్ చేత చీవాట్లు తింటూనే వున్నాడు.
ఇలాంటి భౌతిక హింసలను ప్రక్కన పెడదాం. మానసిక హింసలు ఎలా ఉంటాయో చూద్దాం. ఒక్క అక్షరం తప్పు వ్రాస్తే ఆ పేజీ అంతా ముప్ఫైసార్లు ఇంపోజిషన్ వ్రాయాలంట. రాత్రి నిద్రమానుకుని కునికిపాట్లు పడుతూ వాడు వ్రాస్తాడు. ఈసారి ఇంకా తప్పులు వ్రాస్తాడు. శిక్షలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి.
అక్కడి ఆర్గనైజర్ల ‘భాష’ ఎంత గొప్పగా ఉందో మనం చూసాం. ‘వీళ్ళు’ విద్యార్ధుల్ని ఇంగ్లీషులో మట్లాడమంటారు. తెలుగులో మాట్లాడితే ‘ఫైన్’ వేస్తారు. హాస్టల్లో ఉండే చాలామంది పిల్లలు పల్లెటూళ్ళ నుండి, రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే! వాళ్ళ ‘ఇంగ్లీషు’ అంతంత మాత్రం. ఇది ఎంత మానసిక హింసో చెప్పలేం! వీళ్ళు చేరేటప్పుడు కొంత సృజనాత్మకంగాను, చైతన్యవంతంగాను ఉంటారు. ఇక్కడి వాళ్ళ హింసతో సర్వశక్తులూ కోల్పోతారు.
రోజులు గడుస్తున్నాయి. ఎవరు ఎలాపోతే తనకెందుకులే అన్న స్థితికి వచ్చేశాడు ఆనందరావు. వచ్చేటట్లు కంట్రోల్ చేశారు.
ఒకరోజు – ప్రిన్సిపల్ పిలిపించాడు. క్లాసులో ఉన్న ఆనందరావుకు ఏంటో అర్ధం కాలేదు. ఈ మధ్యకాలంలో తాను ఎలాంటి అడ్డంకులూ పెట్టలేదు. వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా తనకు అనవసరం అని ఊరుకున్నాడు. ఒక ఇన్-చార్జ్ ప్యాడ్`తో విద్యార్ధిని కొడితే అతని తలకు గాయమైంది. మూడుకుట్లు పడ్డాయి. ఆనాడు ఆనందరావు బాధను దిగమింగాడేగాని ఎదురు చెప్పలేదు. ఇంత నిశ్శబ్దంగా తాను తన పని చేసుకుపోతున్నా సరే – ప్రిన్సిపల్ తనను ఎందుకు పిలిపించినట్లో???
ఆలోచిస్తూనే ప్రిన్సిపల్ రూంలోకి అడుగుపెట్టాడు. అక్కడ ప్రిన్సిపాల్ తప్ప ఇంకెవ్వరు లేరు.
“రా! కూర్చో!” కుర్చీ చూపించాడు ప్రిన్సిపాల్.
ఈ మర్యాద ఏంటో అర్ధంకాలేదు ఆనందరావుకు. మెదలకుండా కూర్చున్నాడు.
“సిలబస్ ఎంతవరకు వచ్చింది” అడిగాడు ప్రిన్సిపాల్.
“ఇంకొక్క పాఠంతో సిలబస్ పూర్తి అవ్వుద్ది” అన్నాడు ఆనందరావు.
“ఆనందరావ్! నువ్వంటే పర్సనల్`గా నాకు ఇష్టమే. కాని అనవసరంగా రిస్క్`లో పడుతున్నావు”
“నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేదు.”
“నీకు తెలియకుండా తీసుకోవచ్చుగా” అన్నాడు ప్రిన్సిపాల్ చాలా తెలివిగా అన్నానని మురిసిపోతూ!
“తెలియనప్పుడు నేనెలా చెప్పగలను?”
“అందుకే- నిన్ను కూర్చోబెట్టి చెబుదామని పిలిపించాను”
“ఏంటది?”
“శ్రమదోపిడి గురించి పాఠం చెప్పావటగా!”
“అవును, అది సిలబస్`లో ఉన్నదే”
“ఉండవచ్చు. అంత లోతుగా చెప్పటం ఎందుకు!”
“లోతుగా చెప్పటం ఏమిటి? ఆ రచయిత ఆ పాఠాన్ని ‘శ్రమదోపిడీ’ ప్రధానాంశంగా వ్రాసాడు. అలాంటప్పుడు ఆ ‘కాన్సెప్ట్’ను పూర్తిగా వివరించాలి కదా! పైపైన చెబితే ఎలాగ?”
“ఒక పేరెంట్ కంప్లైంట్ చేసాడయ్యా! అందుకే నిన్ను అడగవలసి వస్తోంది. ఈ సమాజంలో అందరూ శ్రమదోపిడీ చేసే జీవిస్తున్నారని, కొందరు ‘బాగా’ సంపాదించారు అంటే – వాళ్ళు ‘బాగా’ శ్రమదోపిడీ చేశారని చెప్పావంటగా!”
“అవును. కాని- ఆ మాటలు నావికాదు. ‘బొండుమల్లెలు’ పాఠంలో రచయిత చా.సో. చెప్పినవే ” అనాడు ఆనందరావు.
“నువ్వు అదే చెప్పలేదు. ఇంకా చాలా చెప్పావు. దోపిడీ విధానాలు అదనపు విలువ – కారల్ మార్క్స్… ఇవన్నీ చెప్పావు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి, గురజాడ,అల్లూరి, భగత్ సింగ్ – వీళ్ళందరి గురించి చెప్పావు… అవునా”
“అవును- వీళ్ళు ఈ సమాజాన్ని మార్చాలని చూసిన వాళ్ళు! శ్రమదోపిడీ పోవాలంటే – దీనికి ముందు సమాజంలో రావలసిన అనేక సంస్కరణల గురించి చెప్పాను. ఆ సందర్భంలోనే వీళ్ళ గురించి చెప్పవలసి వచ్చింది. ఇదంతా ఆ పాఠానికి సంబంధించిన అంశమే!”
“వరకట్నం, కులాంతర వివాహాల గురించి చెప్పావటగా”
“చెప్పాను. గతంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. ఇంకా జరగవలసినవి ఉన్నాయని చెప్పాను. ఇవి రెండు ప్రజంట్ ప్రోబ్లంస్. వీటిని సంస్కరించాలని చెప్పాను. కులాలుగా సమాజం చీలిపోయి ఉన్నంతకాలం సమాజాన్ని మార్చటం చాలా కష్టం. ‘శ్రమదోపిడీ’ అనేది అందరికీ సంబంధించినది. ఒక కులానికి సంబంధించినది కాదు. అందుకే కులాలన్నీ ఏకం కావాలని చెప్పాను”
“కాని- మరింత ఉత్సాహంతో ‘మీలో కులాంతర వివాహాలు చేసుకునేవాళ్ళెందరో చెప్పండి – అని విద్యార్ధుల్ని అడిగావటగా?”
“అడిగాను. క్లాస్ రూం నుండే ఈ సంస్కరణ అవసరమని అడిగాను.”
“అదే యిప్పుడు నీ కొంపముంచింది. ‘మీరు చదువులు చెబుతున్నారా? కులాంతర వివాహాలను చేసుకోమంటున్నారా!’ అంటూ ఒక పేరెంటు ఘాటుగా దులిపేశాడు” అన్నాడు ప్రిన్సిపాల్.
ఆనందరావు ఏమీ మాట్లాడలేదు.
“నీ అత్యుత్సాహం వల్ల నీ ఉద్యోగానికి ముప్పు వచ్చింది. నీకు అనేకసార్లు చెప్పాను. ఇక నేనేం చెయ్యలేను. డైరెక్టర్ నిన్ను ఉద్యోగానికి రాజీనామ చెయ్యమన్నారు.”
“ఈ పాఠానికి రిలేటెడ్`గా ఉన్న అన్ని అంశాలు చెప్పాలని వాచకంలోనే చివర వ్రాసాడు చూడండి ” అన్నాడు ఆనందరావు.
“వాళ్ళు అలాగే రాస్తారయ్యా! కాని నువ్వు వాళ్ళు రాసారు కాబట్టి చెప్పలేదు. చెప్పాలనుకున్నావు కాబట్టి చెప్పావు. అందుకే నువ్వు కులాంతర వివాహాల దాకా పోయావు.”
“ఏదో మార్కుల కోసం కాకుండా – జీవితాన్ని ఉన్నతంగా మార్చటం కోసం చదువుకోవాలి. అందుకే అలా చెప్పాను.”
“అంత లోతు చదువులు వీళ్ళకు అవసరం లేదు. ఈ కార్పొరేట్ విద్య అంతా షో బిజినెస్ అని నాకూ తెలుసు! ఏమీ అనుకోకు ఇంక నువ్వు వెళ్ళచ్చు.” అన్నాడు ప్రిన్సిపల్
ఈ కార్పొరేట్ ‘ అమానుషం’ పిల్లల్ని భౌతికంగాను, మానసికంగాను హింసించడమే కాక జ్ఞానాన్ని కూదా సెన్సార్ చేస్తోంది. ఉపాధ్యాయుల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తోంది – అని ఎంతో బాధపడ్డాడు ఆనందరావు.
తన రాజీనామా లేఖ సమర్పించి, ఈ అమానుషాన్ని ఎదుర్కోవటం ఎలాగ? అని ఆలోచిస్తూ అడుగు బయటకు వేసాడు.
-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#-
Nice story. keep going