అన్న దమ్ములు – చిన్న కథ

వైకుంఠం విష్ణుమూర్తి ఉదయాన్నే మా ఇంటికొచ్చాడు. వీడి ఇంటి పేరు వైకుంఠం. వీడి పేరు విష్ణుమూర్తి. వీడు నేను ఒకే స్కూల్లో మాష్టర్లం. మామధ్య మంచి దోస్తి ఉంది. ‘ఏరా’ అంటే ‘ఏరా’ అనుకునేంత స్నేహం మాది. దీనికి కారణం మేము ఒకే స్కూల్లో పనిచేయటం కాదు. మేము బాల్య స్నేహితులం. కాకపోతే వీడికంటే నేను కాస్త వయసులో పెద్దవాడిని. వీడిని మేమంతా వి.వి.మూర్తి అని, విష్ణు అని, సింపుల్ గా మూర్తి అని పిలుస్తుంటాం.

వీడి పేరు వినే మా ‘స్టాఫ్’ అంతా నమస్కారాలు పెడుతూ ఉంటే మా సిస్టర్ అంటే వీళ్ళావిడ పేరు ‘శ్రీమహాలక్ష్మి’ కావటం మరింత గందరగోళానికి, కడుపుబ్బ నవ్వుకోవటానికి కారణమయింది. “ఈరోజు శ్రీమహాలక్ష్మి మా గడప తొక్కిందమ్మా” అంటూ ఇరుగుపొరుగు ఆడవాళ్ళు ఆమెమీద జోకులేస్తూ సరదాగా కాలక్షేపం చేస్తుండేవారు.

ఇంతకీ వీడు ఇంత పొద్దున్నే మా ఇంటికెందుకొచ్చాడో నాకు అర్ధం కాలేదు. వాడిని అడగటానికి నాకేమి మొహమాటం లేదుకదా!

“ఏరామూర్తి ఇంత పొద్దున్నే వచ్చావ్ – ఏంటి విశేషం” అన్నాను.

వాడు విషయం చెప్పకుండా భోరున ఏడవటం మొదలు పెట్టాడు. దానితో నాకు కాస్త కంగారు పుట్టింది. ఆ శ్రీమహాలక్ష్మికి ఎమన్నా అయిందేమో అని !

“ఏరా ! ఏమయింది? ఎందుకా ఏడుపు ! శ్రీమహాలక్ష్మి కులాసాయే కదా” ? అన్నాను.

ఈ ప్రశ్నతో మావాడి ఏడుపు ఠక్కున ఆగిపోయింది.

“ఏరా ! నేను ఏడుస్తా ఉంటే దాని సంగతి అడుగుతా ఉన్నావ్” అన్నాడు. ఆ గొంతులో ఏడుపో, కోపమో ఏదీ అర్ధం కావటం లేదు.

“అవున్రా ! నువ్వేడ్చేదంతా అమెకోసమే కదా!” అన్నాను. కాస్త రెట్టించి. ఆమాట పుండు మీద కారం చల్లినట్టయింది వాడికి.

“అంటే నేనెప్పుడూ దానికోసమే ఏడుస్తుంటానా?” అన్నాడు మూర్తి. ఈసారి వాడి గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తోంది.

“అవును – నువ్వేంటి ! ఎవరైనా పెళ్ళాం బిడ్డల కోసమే కదా ఏడుపంతా!” కాస్త జోక్ గా మాట్లాడితే వాడికి త్వరగా మాములు మనిషిని చేయొచ్చని నా అభిప్రాయం.

“నోరుమూసుకో ! వెధవ జోకులూనువ్వునూ ! దానికే అది నిక్షేపంగా ఉంది. నాకేవచ్చింది ఈ ఏడుపంతా !” అని మళ్లీ మూగరోదనలోకి, విషాదమౌనంలోకి వెళ్ళిపోయాడు.

అప్పుడర్ధమయింది – వీడికి, వీడి భార్యకి ఏదో గొడవ జరిగి ఉంటుందని. కోపం వచ్చినపుడే వీడు పెళ్ళాన్ని ‘అదీ’ ‘ఇదీ’ అంటాడు. మాములుగా ఉన్నపుడు పేరుపెట్టే పిలుస్తాడు.

“కాస్త సరిగా చెప్పి ఎడ్వవోయ్ ! ఏంటి శ్రీమహలక్ష్మితో గొడవపడ్డావా ?” అన్నాను.

“ఏవుంది ! మా వెధవ ఉన్నాడుగా !”

“ఎవడా వెధవ ! ఈ లోకంలో చాలామంది వెధవలున్నారు. ఇంతకీ ఈ వెధవ ఎవడో సరిగా చెప్పి ఏడు.”

“ఇంకెవరు – మా తమ్ముడు వెధవ”

“కిష్టమూర్తి సంగతా ! అదీ అసలు విషయం. సరే ఎంత తమ్ముడైనా – వెధవ అంటే ఎలా? వాళ్ళ ఆవిడ – అంటే – మీ మరదలు వింటే పోట్లాడదూ ?”

“ఎందుకు పోట్లాడదూ ! రోజూ ఏదో ఒక పోట్లాట ! ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి కదా – మేమిద్దరం బాగానే ఉన్నాం – ఈ ఆడోళ్ళ గోలే ఎక్కువయింది.”

“ఏంటాగోల ? నీ ఏడుపుకి కారణం స్పష్టంగా రెండు ముక్కల్లో చెప్పు” అన్నాను.

“ఏం చెప్పమంటావ్ ? ఈ ఆడోళ్ళ మాటలకి అర్ధం ఉండదు. మా తమ్ముడికి లాటరీలో లక్షరూపాయలు వచ్చాయట. ‘నువ్వూ ఉన్నావ్ ఎందుకు. నెలజీతానికి ఏడవ్వలిసిందే ! ముష్టి మూడువేలరూపాయల ఉద్యోగం ! ఎన్నాళ్ళు సంపాయించాలి లక్ష !’ అంటుంది. దానితో నాకు ఒళ్ళుమండి ‘నోరుమూస్కో’ అన్నాను. దానితో ఇంకా రెచ్చిపోయింది. అవున్లే ! నీకదే చేతనౌను. నీలాంటి చేతగాని వాడితో కాపురం చేసే కంటే రౌడీతో కాపరం చెయ్యటం సుఖం’ అంటుంది. అంటే మా తమ్ముడు రౌడీ అనీ, వాడి పెళ్ళాం సుఖపడుతోందనీ, వాడు నాకంటే బెటరని దాని ఉద్దేశం.

“అబ్బా ! మా సిస్టర్ నిన్ను చాలా మాటలంది. మరి ఓ లక్ష సంపాదిస్తే పోలా – యిలా ఏడుస్తూ కుర్చోపోతే” అన్నాను.

“ఒరే మాధవా ! జోకులాపు ! నాకు ఎంత బాధగా ఉంది ! మా తమ్ముడంటే – వాడికి చదువు అబ్బలేదు. ఏదో ఆ ఎం.ఎల్.ఏ గారి వెనకాల తిరుగుతూ రౌడీయిజం చేసుకొని బతుకుతున్నాడు. వాడికి నాకు పొంతన ఎలా కుదురుతుంది ? వాడి జీవితం వేరు. నా జీవితం వేరు. వాడు లక్ష ఎలా సంపాదించాడో వాడికే తెలవాలి. అసలు లాటరీలు ఎక్కడ ఉన్నాయి ? అదేవిటో మనకి తెలీదు. ఈ ఆడవాళ్ళకు ఎక్కడ లేని ‘రూమర్లు’ అందిపోతాయి.


విష్ణుమూర్తి, కృష్ణమూర్తి అన్నదమ్ములు. వీళ్ళది చాలా పేద కుటుంబం. వీళ్ళ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు.  చిన్నప్పుడు వీళ్ళనాన్న ఏదైనా తింటానికి పట్టుకొస్తే వీళ్ళ తమ్ముడు తనకు పెట్టింది తినేసి యింకా కావాలని ఏడ్చేవాడు. కలబడి వాళ్ళ అన్న చేతిలోది లాక్కొనేవాడు కూడా ! విష్ణుమూర్తి ఏడుపు మొదలు పెట్టేవాడు. వాళ్ళ అమ్మ వచ్చి ‘తమ్ముడు కదా ! నీకంటే చిన్నోడు కదా ! వాడినే తిననియ్ ! నీకు రేపు బోళ్ళన్ని అప్పచ్చిలు  చేసి పెడతాను’ అని సర్దిచెప్పేది.

పిల్లలు కాబట్టి ఆ విషయాలు అప్పుడే మరిచి పోయే వాళ్ళు. అన్నయ్య తినేది తానూ లాక్కోకూడదనే ‘నీతిశాస్త్రం’ తమ్ముడికి తెలీదు. తన చేతిలోది తమ్ముడికెందుకివ్వాలి ! అన్న ‘తర్కం’ అన్నకూ లేదు. పైగా వాళ్ళ మధ్య సంధానకర్త ‘తల్లి’ మాత్రమే ! ఇతరుల ప్రమేయం ఉండదు కాబట్టి తన కన్నబిడ్డలను తాను చక్కదిద్దుకోనేది. ఎవరిలోను ‘నెగెటివ్’ భావాలు రాకుండా ప్రేమ మాత్రమే నిలిచేటట్లు చూసుకొనేది.

వీళ్ళు పెరిగి పెద్దయిన తరువాత – భార్యలు వచ్చిన తరువాత – జీవిత స్వరూపం ఎంతో మారిపోయింది ! నాది, నీది… అనే విచక్షణ పెరిగింది. జీవితంలో బ్రతుకుతెరువు కోణం ప్రధానమయ్యేసరికి ‘ప్రేమ’ కోణం తగ్గుతూ వచ్చింది.ఎవరిది వాళ్ళు సరిచేసుకోవాలనే ధోరణి పెరిగిపోయింది.

వీళ్ళకొక మిద్దె ఇల్లు ఉండేది. వీళ్ళనాన్న చనిపోయిన తరువాత దానిని అమ్మేశారు. దానిమీద వచ్చిన ఇరవైవేలు వీళ్ళ తమ్ముడే కాజేసి పెళ్ళానికి గొలుసు చేయించాడని విష్ణుమూర్తి భార్యకు లోపల్లోపల సెగరేగుతోంది. పెద్దాయన చదువుకొని ఉద్యోగస్తుడయ్యాడు. డబ్బంతా అయన చదువుకే పెట్టారు. మా ఆయన బండోడు. ఆయనకు చదువులేదు. ఈ డబ్బు తీసుకుంటే తప్పేముంది” అని కృష్ణమూర్తి పెళ్ళాం వాదన.

నిజానికి ఆ డబ్బు అప్పులు తీర్చటానికే సరిపోయిందన్న సంగతి ఆడవాళ్ళు నమ్మరు. వెయ్యో, రెండువేలో మిగిలితే అవి కృష్ణమూర్తి తీసుకొని ఉండవచ్చు. ఏదో కిందామీదాపడి వాళ్ళావిడకు గొలుసు చేయించాడు. అక్కడి నుండి ఎన్నో అపోహలు, అపార్థాలు చోటుచేసుకుంటూ ఈ రెండు కుటుంబాల మధ్య అంతరం పెరిగిపోయింది.

చిన్నప్పుడు ఉన్న ప్రేమలు పెద్దయాక ఉండవు. ఇదే విష్ణుమూర్తి చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని మోయలేకపోయినా ఎత్తుకొనేవాడు. వాడు తనకంటే చిన్నవాడని, వాడు నడిస్తే కాళ్ళు నొప్పెడతాయని భావించేవాడు. వాడి బాధను తన బాధగా స్వీకరించేవాడు. ఎవరైనా తమాషాకి - 

“ఏరా విష్ణు ! మీ తమ్ముణ్ణి మాకిస్తావా ?” అని అడిగితే “నేనివ్వను – మా… తమ్ముడు” అని చెప్పి వాడిని ఇంకా దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టుకునేవాడు. కృష్ణమూర్తి కూడా అంతే “ఏరా మీ అన్నను మేం తీసుకుపోతాం” అంటే వాడు ‘రాయి’ తీసేవాడు. మా అన్నను ముట్టుకున్నారంటే చంపేస్తాను అన్నట్టుగా ఉండేది వాడి ధోరణి.

ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఇప్పుడేమయిపోయాయి ? వీళ్ళే కాదు – లోకంలో అన్నదమ్ముల సంబంధాలు ఎందుకిలా మారిపోతాయి ?

‘ఒరే విష్ణు ! నీ తమ్ముడి సంగతి నీకు తెలియందేముంది ! మీరు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఇహ మీ తగాదాలు ఎందుకు ? సిష్టర్ తో మాట్లాడదాములే నువ్వు బాధపడకు’ అని వాడిని సముదాయించాను..

ఇంతలో మా స్కూలు అసిస్టెంట్ శివారెడ్డి ఫైలు తీసుకువచ్చాడు. నేనే అతన్ని ఉదయాన్నే ఫైలు తెమ్మని చెప్పాను. కాస్త రిటెన్ వర్కు ఉంటే చేద్దామని. మరీ ఇంత ఉదయాన్నే వస్తాడనుకోలేదు. అతన్ని కూర్చోమని చెప్పి ఇద్దరికీ కాఫీ ఇచ్చాను. మా ఆవిడ పుట్టింటికెళ్ళింది. అందుచేత ఇంట్లో అన్ని పనులు నావే ! కాఫీ తాగుతూ ఉండగా అడిగాను.

“ఎం శివారెడ్డి ! నీకు అన్నదమ్ముల గొడవలున్నాయా?”

“వాఅమ్మో ! ఆ సంగతి అడగకండి సార్ !”

“ఏం – ఏంటి అంత భయపడుతున్నావ్ ?”

“భయమే సార్ ! మేం ఐదుగురం అన్నదమ్ములం. నేను చిన్నోడిని. మమ్మల్ని పంచపాండవులనేవోళ్ళు. కానీ ఆ రోజులు మారిపోయినయ్. ప్రస్తుతం మా అన్నలు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుతున్నారు. ఎవరి మధ్య సత్సంబంధాలు లేవు. కొందరు ఉన్నట్టు నటిస్తారు. కొందరు పూర్తిగా దూరమయ్యారు.

మా పెద్దన్నయ్య కూతురు ఇంజనీరింగ్ నాలుగేళ్ళు చదివితే, అదే వూళ్ళో ఉన్న మా మూడో అన్న, వదిన దాన్ని చూడటానికి వెళ్ళలేదు. దాని బర్త్ డే తెలిసి కూడా ఒక్క సంవత్సరం కూడా అభినందనలు చెప్పలేదు. ఇది మా పెద్దన్నయ్యకు,వదినకు కోపం.

నా పెళ్లి కుదిర్చినవాడు మా రెండో అన్నయ్య. మా పెద్దన్నయ్యతో నా పెళ్లి విషయం సరిగా సంప్రదించలేదని… ఈ వ్యవహారం ‘యిలా’ చెయ్యటంతో వాడి ‘స్వార్ధం’ ఏదో ఉందని వీళ్ళు అనుకుంటారు. 

మా నాలుగో అన్నయ్యకి ఉద్యోగం ఇప్పించింది మా రెండో అన్నయ్యే ! ఈ విషయాన్ని మా రెండో వదిన వాళ్లకి జీవితాంతం గుర్తుచేస్తా వుంటాది. “మా అయన ఉద్యోగం యిప్పించకపోతే మీ అయన అడుక్కుతినేవాడు” అని మా నాలుగో వదినతో అనటం ఆమె సహించలేకపోయేది. “అవును నా మొగుడు సిగ్గులేకే ఈ ఉద్యోగం చేస్తున్నాడు” అని ఆ రాత్రికి మా అన్నయ్యతో తగాదా వేసుకొనేది.

ఇలా ఎన్నని చెప్పమంటారు ! చెప్పలేనంత చండాలంగా ఉండే విషయాలు కూడా చాలా ఉన్నాయి. అనేక అపోహలు, అపార్థాలు, అర్థ సత్యాలతో వీళ్ళ హృదయాలు లుకలుక లాడిపోతున్నాయి. అందరు నాశనమయిపోయి వాళ్ళు, వాళ్ళ పిల్లలు మాత్రమే అభివృద్ధికి రావాలని దేవుడికి కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళున్నారు. మీరు నమ్మొచ్చు – నమ్మకపోవచ్చు ! మనుషులెందుకిలా జీవిస్తున్నారో నాకు అర్ధం కావటంలేదు సార్!” అంటూ ఏడ్చాడు శివారెడ్డి.

అతని భుజం తట్టి ‘బాధపడొద్దు’ అన్నాను. అతను కళ్ళు తుడుచుకొని మాములు అయిపోయాడు.

“చుసావట్రా మూర్తి ! అన్నదమ్ముల తగాదా నీకొక్కడికే కాదు చాలామంది ఇలాంటి బతుకే బతుకుతున్నారు. నా సంగతి కూడా చెబుతాను వినండి” - 

మా అబ్బాయి అమెరికా వెళ్ళాడని, అక్కడే పెళ్లి చేసుకున్నాడని తెలిసి మా అన్నయ్య ఎంత అసూయ పడ్డాడని ! మా వాడి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో చూద్దాం రమ్మంటే ‘వస్తాలే’ అని రాకుండా వెళ్ళిపోయాడు. స్వార్ధపరుల్నైనా క్షమించచ్చు గాని, అసూయపరుల్ని అసలు క్షమించలేం” ఈ మాటలు అంటున్నప్పుడు నాలో ఉద్రేకం పెరిగింది. అది గ్రహించి నాకు నేనే ఒక్క క్షణం మాట్లాడటం ఆపేసాను. కొన్ని క్షణాల మౌనం తరువాత యిలా అన్నాను.

“మనమే కాదు. పురాణకాలం నుంచి యిదే పరిస్థితి. భీముడికి విషంపెట్టి చెరువులోకి తోసారు. ధృతరాష్ట్రుడు భీముణ్ణి తన ఉక్కు బాహువుల్లో బంధించి తునాతునకలు చెయ్యాలనుకున్నాడు.కైకేయి తన కొడుకు మీద ప్రేమతో రాముణ్ణి అడవులకు పంపాలని కోరింది.

పురాణకాలమే కాదు – ఇప్పుడు కూడా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అతని తమ్ముడు రామ్మూర్తినాయుడు, ముఖేష్ అంబానీ – అనిల్ అంబానీ, అమితాబ్ అతని తమ్ముడు అజితాజ్… వీళ్ళంతా సమాజంలో పై స్థానాల్లో ఉన్నారు. అయినా అన్నదమ్ముల పోరు తప్పలేదు. మరికాస్త భావోద్రేకం పెరిగి ప్రవీణ్ మహాజన్ – తన అన్న ప్రమోద్ ను క్రూరంగా పిస్టల్ తో కాల్చి అన్నదమ్ముల తగాదాల్లో కొత్త కోణం తెరచాడు.

ఒరే విష్ణు – ఇవి అన్ని విన్న తరువాత నీకేమనిపిస్తోంది. దీంట్లో నువ్వు బాధపడాల్సిందేమీ లేదు. నీ తమ్ముడు లక్ష సంపాయించాడని అసూయపడితే లాభం ఏముంది? ఎవరి బ్రతుకులు వాళ్ళు ఉద్రేకపడకుండా జీవించాలి” అన్నాను నేను.

మా శివారెడ్డి అనుభవము, నా అనుభవము విన్న తరువాత మా మూర్తి కాస్త తేరుకుని - 

“మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనని ఎవరో పెద్దమనిషి అన్నట్టు విన్నాను. కానీ ఎవడి ఆర్ధిక వనరులతో వాడు జీవిస్తూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కుళ్ళిపోతున్నారు ఎందుచేత ?” అన్నాడు.

ఎక్కడో మనుషుల్లో దాక్కున్న ఈర్ష్య, అసూయలు చెలరేగి ఇలాంటి పరిస్థితి తెచ్చిపెడుతున్నాయి. ‘రక్తసంబంధం’ సినిమాలో ఆ అన్నాచెల్లెళ్ళు ఎందుకు చచ్చిపోయారు ? వాళ్ళ దోషం ఏమిలేదు. సూరేకాంతం అసూయ వాళ్ళను బలితీసుకుంది. అలాగే అన్నదమ్ముల సంబంధాల్లో కూడా తెలియని సూరేకాంతాలు, నాగభూషణాలు ఎందరో ఉంటారు. కొంపకు నిప్పెట్టేసి వాళ్ళు మెదలకుండా కూర్చుంటారు. మంధర మాట వినేగా కైక రాముణ్ణి అడవులకు పంపింది. ఇవన్ని బాహ్య కారణాలయితే అంతర్గత కారణాలు చాలా ఉంటాయి. మన సంప్రదాయాలు దెబ్బ తినటం దీనికొక కారణం. మనిషిలోని ఆశ అత్యాశగాను, దురాశగాను మరి మానవత్వం నశిస్తోంది.ముఖ్యంగా పాశ్చాత్య (సామ్రాజ్యవాద) సంస్కృతి మనలను మరింత హీనులుగాను, ఏకాకులుగాను మార్చేస్తోంది” అన్నాను నేను.

శివారెడ్డి కాఫీ పూర్తిచేసి “వెళతాను సార్, మీ దగ్గరకు వచ్చి చాలా విషయాలు తెలుసుకున్నాను. కాస్త మనసు తేలికపడింది. అయినా ఈ గొడవలన్నీ మనతరం తోనే ఆఖరు. రాబోయే తరంలో అన్నదమ్ములే ఉండరులెండి. ఇప్పుడు అందరికి ఒక్కరు లేక ఇద్దరేగా ! ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి. ఇహ తన్నుకునే అవకాశం లేదు. ముందు ముందు – నాకొక అన్న ఉంటే బాగుండును, నాకొక తమ్ముడుంటే బాగుండును అనుకునే రోజులు వస్తాయి” అన్నాడు.

అతని మాటలు అక్షర సత్యం అనిపించాయి.

విష్ణుమూర్తి కాస్త తేరుకున్నాడు. ఆ రోజంతా నాతోనే ఉన్నాడు. ఆదివారం కావటం వల్ల అనేక విషయాలు మాట్లడుకో గలిగాం. నా ఫైలు పనంతా పూర్తి చేశాను. ఆ సాయంత్రం ఇద్దరం కలిసి శ్రీమహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవటానికి వాళ్ళింటికి బయలుదేరాం.


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )