ధర్మగుణం

“ఒరే ! సుబ్బిగా యిలా వచ్చావేరా?”

“తవరి దరశనం సేసుకుపోదామని” అన్నాడు సుబ్బిగాడు.

“ఏం అలావున్నావు? వంట్లో బాగాలేదా?”

“అవును బాబయ్యా. పది రోజుల నుండి లేవటంలేదండి. తవరు ఏదైనా సాయం సేత్తే నలుగు రోజులపాటు తింటాను బాబుగారు.”

“ఆ ! ఏమన్నావు ! ఏదైనా…”

“…మరేనండి ఏదో నాలుగు కుంచాలు ధాన్యం గింజలు యిప్పించండి బాబు. నాలుగు రోజులపాటు తిని ఓపిక గూడుగట్టుకున్నాక పనిలోకి వచ్చి మీ రుణం తీర్చుకుంటా బాబు.”

“నీ కిస్తా కేమిటిరా ! అలాగే యిద్దును. కానీ సమయానికి ఇంట్లో ధాన్యం లేదు. పోనీ డబ్బులేమన్నా యిద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.(ఎక్కడ మళ్ళీ డబ్బులాంటాడో అని ముందుగానే చెప్పేసాడు) యివాళ కాకపోతే రేపు యిద్దువు. నీలాంటి నమ్మకస్తుడికి యిస్తే ఎక్కడికి పోతాయి. పాపం ఓపిక చేసుకుని వచ్చావు. లంకణాలు ఎక్కువ చేసావో ఏమో – మరీ నీరసంగా ఉన్నావు. ఏమే ! నిన్నే – కాస్త మజ్జిగ తీసుకురా” గావుకేక పెట్టారు ధర్మయ్య గారు.

ధర్మ ప్రభువులు కాబట్టి మజ్జిగ అనే నీళ్ళు యిచ్చారు.

తడి ఆరిపోయిన గొంతులో నీళ్ళు పోసుకుని —-

“వత్తాను బాబుగారు” అని కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరాడు సుబ్బిగాడు.

“ప్రతి వెధవకొడుక్కి అప్పు కావాలి. వీళ్ళకు యివ్వటం – వీళ్ళు మళ్ళీ నాకు తీర్చటమూనా ! రేపో మాపో చచ్చేవాడిలా ఉన్నాడు. అప్పు తీరుస్తాడట అప్పు. దుక్కలా వుంటే ఇవ్వొచ్చు. దేనికైనా పనికొస్తాడు.” అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ధర్మయ్య గారు.

సుబ్బిగాడు నీరసంగాపోతూ ‘ధర్మయ్య బాబుగారు ధరమ పెబువులు. ఒకసారి ఏదో పెట్టి అర్ధరేతిరి పట్టికెళ్ళి పొరుగూరి పాపయ్యగారికి యిచ్చినందుకు పాతిక రూపాయలు యిచ్చారు. నాలుగు ఏళ్ళనాడు ఎలక్షన్లలో ఏ పనీ లేకపోయినా అక్కడివి యిక్కడ, యిక్కడివి అక్కడ చేరేసినందుకు, ఏదో నలుగురితోపాటు అరచినందుకు – రోజూ పది రూపాయలు యిచ్చేవోరు మారాజులు. ఇలా ఎన్నో రూపాయలు లెక్కలేకుండా ఇచ్చారు. అలాంటి మా పెబువులు డబ్బులుంటే ఒక్క పది రూపాయలు ఇవ్వరా? ఎంతోటోడికైనా యిబ్బందులుంటాయి. ఇంతకీ నా కర్మ యిలా వుండి అయన దగ్గర సొమ్ములేకపోయింది. ఈ పది రోజులనుండి మందులకు, మాకులకు ఇంట్లో వున్నవి తాకట్టుపెట్టి – దొరికినంత మట్టుకి అప్పు చేశాను. మాయదారి తెగులు నాకే రావాలా ? కూటికి లేక సత్తుంటే మందులకు ఎక్కడ పోయను… ఎదవ పానానికి ఇంత తీపి ఎందుకు?… ఆలోచిస్తూ యింటికి చేరాడు.

“పేనం సొమ్మసిల్లి పోతంది. గుక్కెడు మంచినీళ్ళు యిచ్చేవోరు లేరు గందా” నులక మంచం మీద వాలిపోయాడు.

నాలుగు రోజులు పోయాక — ఒకనాటి పొద్దుట —-”సుబ్బయ్య పోయాడురా” అన్నాడొక ఆసామి.

“ఆ ! సుబ్బిగాడు పోయాడా ! రామ రామ” అంటూ తుపుక్కున ఉమ్మేసాడు మరొక ఆసామి.

“ఏమిటేమిటీ సుబ్బిగాడు పోయాడా ! ఆ ధర్మయ్యగారి పనిలో తిరిగే సుబ్బిగాడేనా? దుక్కలా ఉండేవాడు. ఎట్టా పోయాడు.”

సుబ్బిగాడి శవం చుట్టూ పది పదిహేనుమంది గుమికూడారు.

“అయ్యో ! ఎంత మంచివాడని – ఒకళ్ళని పన్నెత్తుమాట అని ఎరుగడు కదా! మొన్న లంకణాలు పడ్డాడు కాబోలు. రెండు రూపాయలుంటే యిమ్మని వచ్చాడు. సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేదు.”

“ఏనాడు పెళ్ళాం పోయిందో కానీ ఆనాటినుండి ఈనాటివరకు కూడా తనే వండుకుంటూ పని ఉన్ననాడు ఎళ్ళి, లేనినాడు ముసుగుతన్ని పడుకునేవాడు.”

“ఎవరికైనా ఏదైనా సాయం కావలిసొస్తే ముందూ ఎనకా చూడకుండా – తన పనే అనుకుని చేసేవోడు.”

మాలావు కట్టం పడేవోడులే.”

“ఎన్ననుకుంటే ఏటుంది – ఈనాటికీ భూమ్మీద నూకలు సెల్లిపోనాయి.”

…యిలా ఆ గుంపులోంచి అనేక మాటలు వినిపిస్తున్నాయి. సుబ్బిగాడు చేసిన మంచిపనులకు మరికాస్త మంచితనం కల్పించి తెగ పొగుడుతున్నారు.

అంతలో ఎవరో “తప్పుకోండి” “తప్పుకోండి” అంటున్నారు. వెనకాలే ధర్మయ్యగారు ఎంతో దయతో సుబ్బిగాడి శవం చూట్టానికి వచ్చారు.నడుంకు అంటుకుపోయిన పొట్ట, తోటకూర కాడల్లాంటి కాళ్ళూ చేతులు, అంగుళం లోతుకు పోయిన గాజుకళ్ళు… పాపం అంతోటి పెద్దమనిషికి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి(వచ్చాయో రాలేదోగాని భుజం మీద కండువాతో కళ్ళు తుడుచుకోవటం ప్రజలు చూసారు)

“ఒరే ! నాగన్నా ! అలాచూస్తావేరా ! మన కుడిభుజం పడిపోయిందిరా.దుక్కలా వుండి బండెద్దులా పనిచేసేవోడు. ఏది చెప్పినా చిటికెలో చేసిపెట్టే వాడు. నేటికి — వీడికి మనకి రుణం తీరిపోయింది. ఇన్ని లంకణాలు చేసినా నాకు తెలియదు. ఏ చిన్న కుర్రాడితో కబురు పంపినా ఒక పాతిక రూపాయలు ఇవ్వకపోదునా ! అబ్బే వాడు ఎలా అడుగుతాడు ! అభిమానం ఎక్కువ. అసలు కూలిపని లోకి వచ్చినపుడే అడిగేవాడు కాదు. ఇస్తే పుచ్చుకోవటం – లేకపోతే లేదు. ఇవిగో ఈ యాభై పట్టుకెళ్ళి పుల్లలుగట్రా చూడండి.” అంటూ మళ్లీ కళ్ళు తుడుచుకున్నారు ధర్మయ్య గారు.

“మారాజులు యిట్టే వచ్చి అట్టే యాభై రూపాయ లిచ్చారు.

“ముందే ఓ వంద అడిగి వుంటే యీడికి చావు రాకపోనుగదా.”

…. ధర్మయ్య గారి ధర్మగుణాన్ని ప్రజలు ఆశ్చర్యపోతూ చెప్పుకున్నారు.

ఈ సారికూడా ఎలక్షనులో ధర్మయ్య గారే గెలిచారు. అందుకు కారణం – ‘అయన ఔదార్యం. సాటిమనిషిని కన్నబిడ్డలా చూసే తత్వం. ఆయన గుణమే గుణం – ధర్మగుణం’ అన్నారు ప్రజలంతా.

కాని ఒక తూరీగ మాత్రం – ‘ఆయన గుణం మీకేం తెలుసు, బ్రతికినంత కాలం సుబ్బయ్య శక్తిని జలగలా పీల్చాడు. తీరా చచ్చిన తరువాత వాడి శవానికి ఏభై రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రజల అభిమానాన్ని కొన్నాడు’ —- అంటూ తుర్రున ఎగిరిపోయింది.

One Response to ధర్మగుణం

  1. ప్రస్తుత కలి థర్మానికి సరిగ్గా సరిపోయే కథ. వ్యక్తి నుండి దేశందాకా కూడా ప్రస్తుతము ఇదే థర్మము రాజ్యమేలుతోంది. స్వార్థమనే పందిరికింద తలదాచుకొనే వారికి చెప్పులు లేక ఎండలో నడిచి వెళ్ళే వారి బాధలు ఎలా తెలుస్తాయి. బలహీనునికి దిక్కు దైవమే…

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )